శనివారం 30 మే 2009

నేను అయిపోయా విశాఖ వాసి,,,

మొదటగా ఒక విషయం చెప్పాలి.
విశాఖ వాసులు ఎంతో అదృష్టవంతులు

కొంతకాలం గా నా బ్లాగుకి దూరంగా వుండి మీ అందరిని బ్లాగు ముఖంగా కలుసుకోలేక పోయినందుకు క్షమించండి. అందరికి శకునాలు చెప్పే బల్లి కుడితి లో పడింది అని,,, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా తెలిసిన వారివి ఒక 10 రెస్యూములు వుండేవి. అలాంటిది నాకు కొత్త జాబు వెత్తుక్కునే సరికి రెండు నెలలు పైన పడింది.

గత మూడు నెలలు గా నా జీవితం లో చాల ట్విస్టులు జరిగాయి. బెంగళూరు లో కంపెనీ చుట్టేసి, మా కంపెనీ ఏమ్ప్లోయీస్ అందరిని వేరే వేరే జాబుల్లో ప్లేస్ చేసి, పెండింగ్ ప్రాజెక్ట్స్ థర్డ్ పార్టీ వారికి ఇచ్చి, హైదరాబాదుకు వచ్చి జాబు వేట లో జాబు కన్సల్టంట్ ఆఫీసులు అన్ని తెగ తిరిగేసి అలసిపోయి వుంటిని. కొంచెం టెన్షన్, నో నో చాల టెన్షన్ అనుభవించా. ఈ మధ్యలో ఒక లంబా లవ్ స్టొరీ క్లైమాక్స్ కి వచ్చి రొటీన్ గా ఆగిపోయింది. తను నా childhood sweat heart, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నా ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యాక (1998) లో తన తో break-up అయ్యింది. ఇన్ని ఏండ్ల తరువాత నాకు మెయిల్ చేసి తనకు పెళ్లి, US వెళుతున్నాను అని చెప్పింది.

ఆ వెంటనే నాకు విశాఖ పట్టణం లో మంచి జాబు వచ్చింది. ఈ 25th మే-09 జాయిన్ అయ్యాను. MVP కాలనీ లో నివాసం. ప్రొద్దున్నే 5:30 కి తెన్నేటి పార్క్ లో జాగింగ్. అక్కడ మున్సిపాలిటీ వారి దోమలబండి లా కనిపించే ఒక డొక్కు యమహా వుంటే తిట్టుకోకండి, అది నాదే. ఇక ద్వారకానగర్ లో ఆఫీసు. టీవీ లో, సినిమాలలో చూసిన, విన్న ప్రాంతాలు అన్ని ఇప్పుడు స్వయంగా చూడగలుగుతున్నా. ఆశిల్ మెట్ట, జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్, సీతమ్మ ధార, పోర్ట్ ఏరియా, గాజువాక, ఆంధ్ర విశ్వవిద్యాలయం,కైలాసగిరి, అక్కయ్యపాలెం, సీతంపేట, ఇసుకతోట.


యాస
ఒక్క మాట కూడా పూర్తి కాకుండానే అవతలి వారు నా యాసని పసికట్టేస్తున్నారు.
" ఏవూరు మాష్టారు మనది"
"అనంతపురం"
"అబ్బో, చాల దూరం నుంచి వచ్చారు"
ఇది రోజు కి రెండు సార్లు అన్నా జరిగే వ్యవహారం.

చేతి రుమాలు
ఇప్పటివరకు వరకు తెలుపు రంగులో వుండేవి వాడే వాడిని. అవి మధ్యాహ్నం అయ్యే సరికి లారి ని కడిగిన తరువాత బట్ట ఎలాగావుంటుందో అలా తయారయ్యేవి. అందుకే వచ్చే వారం లారి డ్రైవర్లు వాడే రంగు రుమాళ్ళు కొనాలి అని నిశ్చయించుకున్నా.

తెన్నేటి పార్కు
పైన కైలాసగిరి. కింద సముద్రం, మధ్యలో తెన్నేటి పార్కు. నా జీవితం లో సముద్రం ఒడ్డున జాగింగ్ చేస్తాను అని అనుకులేదు. ఇప్పుడు రోజు చేస్తున్నా. పొద్దున్నే సూర్యోదయం తో బంగారు రంగు అలుముకునే సముద్రం, చల్లటి గాలి, uphill jogging, దూరంగా ఆగి వుండే షిప్పులు, తెర పడవలు, అనంత జలరాశి, లాఫర్ క్లబ్బు సభ్యుల నవ్వులు.


విశాఖపట్టణం
రాజమహేంద్రవరం పైన వ్రాసిన "అమర ధామం లా" లాంటి గొప్ప పాట రాయడానికి నేను అంత పెద్ద కవిని కాదు కాని, విశాఖ కూడా అంతే సుందర నగరం. విశాలమైన రోడ్లు, బీచులు, అతి తక్కువ ట్రాఫిక్ సిగ్నల్స్, మంచి మనుషులు, వినాలనిపించే యాస. ఆంధ్ర టిఫిన్స్, కూరలు. దేవుడు నా ప్రార్థన విన్నట్టు వున్నాడు. అందరికి తెలిసిన Guns n Roses పాట నిజం చేసాడు,,
take me down to the paradise city
where the grass is green
and the girls are pretty,,,,

పొడవైన అమ్మాయిలు
ఎవరైనా పొడవైన అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలనుకునే వారికి నాదొక సలహా.
Vishakapattanam is the Place. ఇక్కడ 8 out of 10 అమ్మాయిలు పొడవుగా వుంటారు.

చెమట
బెంగుళూరులో 10 కిలోమీటర్లు నడచినా చుక్క చెమట పట్టేది కాదు. ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా ఏడేళ్ళ చెమటంతా వచ్చేసింది.
కొత్తగా విశాఖపట్టణం వచ్చే వారికి ఒక ఉచిత సలహా
Do: Call your friends in other cities and brag about all the amazing stuff that Vizag has.
Don’t: Let them crash at your place and actually make you do all that amazing stuff.
పక్కనే పైన అప్పన్న వుంటాడు. అన్ని గమనిస్తూవుంటాడు. విశాఖను రక్షిస్తూ వుంటాడు. తింగర వేషాలు వేయకుండా జాగ్రత్తగా వుండండి.
కొద్ది రోజులే అయ్యింది. ఇంకా చూడాల్సినవి చాల వున్నాయి. విశాఖ గూర్చి పూర్తిగా తెలుసుకొని అప్పుడు ఇంకొక టపా వ్రాస్తాను .
చివరగా ఒక విషయం చెప్పాలి.
విశాఖ వాసులు ఎంతో అదృష్టవంతులు.